ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది విజయనగరం టీడీపీ..సమస్యలకు నిలయంగా మారుతోంది. ప్రధానంగా రెబల్ అభ్యర్థులతో ఆ పార్టీ గెలుపు అవకాశాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. ముఖ్యంగా టికెట్ ఆశీంచి భంగపడ్డ గీత రెబల్‌గా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కూటమి పొత్తులో భాగంగా విజయనగరం అసెంబ్లీ సీటును పి.అదితి గజపతిరాజుకు కేటాయించింది. అయితే 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మీసాల గీత ఈసారి టికెట్ ఆశీంచిన భంగపాటు తప్పకపోవడంతో టీడీపీ రెబల్‌గా పోటీ చేసేందుకు ఇప్పటికే అనుచరులతో సమావేశం నిర్వహించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గీతకు స్థానిక టీడీపీలో మంచి పట్టు ఉంది. టీడీపీ అభ్యర్థిగా అశోక గజపతిరాజు కుమార్తెను ప్రకటించినప్పటి నుండి పార్టీ నేతలకు,గజపతిరాజుకు దూరంగా ఉంటు వస్తున్నారు. దీంతో ఈసారి టీడీపీ గెలుస్తుందా అన్న సందేహం స్థానికంగా వ్యక్తమవుతోంది.
టీడీపీ ఆఫీస్ అశోక గజపతిరాజు బంగ్లాలో టీడీపీ అధికారిక కార్యాలయం ఉండగా గీత మాత్రం విజయనగరం నగరంలో సొంతంగా కార్యాలయాన్ని నడుపుతున్నారు. అశోక్ బంగ్లాలో ఇంతవరకు ఆమె అడుగు పెట్టలేదు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఆమె నియోజకవర్గం టిక్కెట్‌ను ఆశించారు. కానీ టికెట్ రాకపోవడంతో తన బలాన్ని నిరూపించుకునేందుకు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇదే గనుక జరిగితే ఇది ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి పి అదితి గజపతి రాజు గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుంది. గీతను బుజ్జగించేందుకు అశోక గజపతిరాజుతో పాటు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్న ఆమె మాత్రం శాంతించడం లేదు.
