టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని అభ్యర్థనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. నాని నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించి ఆయన సీఎంకు ఒక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్లో ఉన్న ప్రముఖ థియేటర్లో తన అభిమానులతో కలిసి ఈ సినిమా ప్రీమియర్ షోను వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నాని రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
నాని చేసిన ఈ అభ్యర్థనపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడంపై నాని చూపుతున్న నిబద్ధతను ముఖ్యమంత్రి అభినందించారు. సినిమా పట్ల, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిభ పట్ల నానికి ఉన్న తపన అభినందనీయమని కొనియాడారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మార్గదర్శకాలను సూచించారు. థియేటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భారీ జన సమూహాన్ని నియంత్రించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనికోసం దయచేసి నిర్దేశిత స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నాని దరఖాస్తును సంబంధిత పోలీసు బృందం పరిశీలిస్తుందని, దానికి అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి కూడా సీఎం తక్షణ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ‘ది ప్యారడైజ్’ సినిమాకు సోషల్ మీడియాలో ఎదురైన కొన్ని ఇబ్బందికర పరిణామాలపై కోర్టు ఊరటనిచ్చింది. సినిమాకు సంబంధించి కొన్ని అనుచిత పోస్టులను తొలగించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ నెలకొంది.

