రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికా కాంగ్రెస్ ఒక బిల్లును ఆమోదించింది. ఈ పరిణామంపై భారత్ తాజాగా స్పందించింది. తమ దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దేశ ప్రజల ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాలే తమ చమురు దిగుమతులకు ప్రాతిపదిక అని మరోసారి తేల్చిచెప్పింది.
అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కల్పించారు. దీని పరిధిలోకి భారత్, చైనా వంటి దేశాలు వచ్చే అవకాశం ఉండటంతో ఈ అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ బిల్లు ఆమోదంపై భారత విదేశాంగ శాఖ గురువారం అధికారికంగా స్పందించింది. దేశంలోని 140 కోట్లకుపైగా ప్రజల ఇంధన అవసరాలను తీర్చేందుకే వివిధ దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నామని పేర్కొంది. అమెరికా ఒత్తిడి ఎలా ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం తన ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేసింది. ఈ బిల్లు వల్ల ద్వైపాక్షిక సంబంధాలపై పడే ప్రభావాలను ఇప్పటికే అమెరికా వర్గాలకు స్పష్టంగా వివరించినట్లు తెలిపింది.
అయితే, ప్రతినిధుల సభ ఆమోదించినంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్‌లు అమల్లోకి వచ్చినట్లు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ బిల్లు ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదానికి చేరింది. ఏ దేశంపై ఎంత టారిఫ్ విధించాలనే పూర్తి అధికారం ఇప్పుడు ట్రంప్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు అందుతున్న ఇంధన ఆదాయాన్ని తగ్గించడమే ఈ అమెరికా చర్యల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, భవిష్యత్ పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత్ అన్ని మార్గాలను పరిశీలిస్తోంది.

