తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. సవాళ్లు ప్రతిసవాళ్లతో ముఖ్యంగా నల్గొండ జిల్లా రాజకీయాలు ఒకడుగు ముందే ఉంటాయి. అధికార బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు జరగనుండగా ఎప్పుడూ ఈ జిల్లా రాజకీయాలు సెన్సేషనే. ఎందుకంటే ఈ జిల్లా నుండే రాజకీయ ఉద్దండులు ఉన్నారు. జానారెడ్డి,ఉత్తమ్,కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ నుండి ఉండగా జగదీష్ రెడ్డి ప్రధానంగా బీఆర్ఎస్‌ను తన భుజాలపై మోస్తున్నారు.
ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గెలవకపోతే గడ్డం గీయను అని సవాల్ విసిరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పటి నుండి గడ్డంతోనే దర్శనమిస్తున్నారు. ఇక తాజాగా ఈ ఎన్నికల్లో మరో సంచలన సవాల్ విసిరారు. హుజుర్‌నగర్‌లో 50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం చేస్తానని మరోసారి వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మొదటి మెట్టు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కావడం ఖాయం అని జోస్యం చెప్పారు. 30ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదని చెప్పుకొచ్చారు. ఉత్తమ్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోగా ఇవే ఆయనకు చివరి ఎన్నికలు అయితాయా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది.