సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ కీలక నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ సీటును ఆశీంచారు విక్రమ్. ఇందుకు తగ్గట్టుగానే గ్రౌండ్ ప్రీపేర్ చేసుకున్నారు. అయితే బీజేపీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కే సీటును ఇచ్చింది.
అప్పటినుండి పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు విక్రమ్ గౌడ్. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం అధిష్టానం కల్పిస్తుందని భావించినప్పటికీ ఎలాంటి హామీరాకపోవటంతో పార్టీకి రాజీనామా చేశారు.
పార్టీలో కొత్త వారిని అంటరానివారిగా చూస్తున్నారని ఆరోపించారు విక్రమ్. క్రమశిక్షణకు మారుపేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని..తనలాంటి వారికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీటవేసి వారికి కింద పనిచేయాలని చెబుతున్నారని ఇది కరెక్ట్ కాదని ఆరోపణలు చేశారు.
ముఖేష్ గౌడ్ వారసుడిగా రాజకీయాల్లో ఉన్నారు విక్రమ్ గౌడ్. బలమైన గౌడ సామాజిక వర్గం కావడం, గ్రేటర్‌లో పెద్ద ఎత్తున అనుచరగణం విక్రమ్‌కు ఉండటంతో ఆయన పార్టీని వీడటం బీజేపీ పెద్ద దెబ్బేనని ప్రచారం జరుగుతోంది. ఇక విక్రమ్ త్వరలోనే సొంతగూటికి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం.