రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం. అధికారంలో ఉన్నంత వరకు పార్టీ అధినేతలకు జై కొట్టే నేతలు ఒక్కసారి ఓడిపోతే మాత్రం యూ టర్న్ తీసుకుంటారు. ఏ నోటితో అయితే పొగిడారో అదే నోటితో విమర్శలు చేయడమే కాదు పార్టీని వదిలి వెళ్లిపోతారు. తాజాగా ఏపీలో వైసీపీలో ఇదే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గోడ మీద ఉన్న పిల్లులాంటి నేతలంతా పార్టీని వీడుతున్నారు. పోతుపోతు ఓ రాయి వేసి పోతున్నారు.
అయితే తాజాగా వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రెడీ అయిన సునీత రాకను తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నారు. చీ పార్టీ కష్టకాలంలో ఉండగా, ఆదుకోవాల్సిన ఎమ్మెల్సీ అప్పుడు పార్టీని వీడి ఇప్పుడు అధికారంలోకి రాగానే తిరిగి సొంతగూటికి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చీరాల టీడీపీ నేతలు వ్యతిరేక గళం వినిపిస్తుండటంతో ఆమె చేరిక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబును నమ్ముకుని ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు సునీత. అయితే తనను వైసీపీకి రాజీనామా చేసేలా ప్రోత్సహించిన ఓ మంత్రి ఇప్పుడు పార్టీలో చేరిక విషయంలో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే భారం అంతా చంద్రబాబుపై వేశారట సునీత. టీడీపీ అధినేతను కలిసేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్న బాబు అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి ఉందట. దీంతో సునీత పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా ఉందని చీరాల రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర అనుచరులుగా పోతుల సునీత, ఆమె భర్త సురేశ్‌కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పాలమూరు జిల్లా అలంపూర్ నుంచి జడ్పీటీసీగా ఎన్నికైన సునీత ఆ తర్వాత రాయలసీమ రాజకీయాల్లో చక్రం తిప్పారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు .అయితే ఆ తర్వాత 2017లో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. 2019లో టీడీపీ అధికార కొల్పోగా వైసీపీలో చేరి రెండోసారి ఎమ్మెల్సీ అయ్యారు.
