షర్మిలకు వైఎస్‌ భారతిరెడ్డి లేఖ.. క్లారిటీ ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా పచ్చ మీడియా మరో కొత్త కుట్రకు తెరలేపింది. వైఎస్‌ షర్మిలకు వైఎస్‌ భారతిరెడ్డి లేఖ రాశారంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు రాయనే లేని ఒక నకిలీ లేఖను సృష్టించి, దాన్ని పచ్చ మీడియా ఛానళ్లలో బ్రేకింగ్‌ న్యూస్‌గా ప్రసారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రకు పాల్పడుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలు, దౌర్జన్యాలు భారీగా వెలుగుచూస్తున్నాయి. నామినేషన్ల అడ్డంకులు, దాడులు, బెదిరింపుల వంటి అరాచకాలను ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియలో కూటమి నేతలు అడ్డంగా దొరికిపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది.

ఈ తీవ్ర ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ అండ్‌ కో ఈ విధమైన నీచమైన ఎత్తుగడలు వేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. లేని లేఖను స్వయంగా సృష్టించి, వైఎస్సార్ కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉన్నట్లు భ్రమ కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, పచ్చ మీడియాలో గంటల తరబడి చర్చలు పెడుతూ నాటకాలు ఆడుతున్నారు.

రాజకీయ లబ్ధి కోసం కుటుంబ వ్యవహారాలను అడ్డం పెట్టుకుని ఇంత దారుణంగా దిగజారడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల అక్రమాలను ప్రశ్నించకుండా ఉండేందుకే ఇలాంటి కల్పిత కథనాలను వండి వారుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కూటమి దుశ్చర్యలను, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.