ఒకే వేదికపై జగన్, విజయ్, కేటీఆర్

చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి, మాలిని దంపతుల కుమార్తె శ్రేయరెడ్డి వివాహం ఉజ్వల్‌తో జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

ఈ వివాహ మహోత్సవానికి వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దంపతులు విచ్చేశారు. నూతన వధూవరులను అక్కున చేర్చుకుని అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ చెన్నైకి వస్తున్నారని తెలుసుకుని అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఈ వేడుకలో రాజకీయ, సినీ రంగాలకు చెందిన దిగ్గజాలు ఒక్కచోట చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ప్రముఖ నటి త్రిష ఈ వివాహానికి హాజరయ్యారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు కూడా విచ్చేశారు.

ఈ వేడుకలో వైయస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖుల రాకతో లీలా ప్యాలెస్ ప్రాంగణం చాలా సందడిగా మారింది. రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు ఒకే వేదికపైకి రావడంతో ఈ వివాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.