‘చంద్రబాబువి గ్లామర్ కబుర్లే.. వాస్తవాలు ఇవే’

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొచ్చి ఏడాది అవుతున్నా.. అభివృద్ధి పేరుతో కేవలం మోసపూరిత ప్రచారమే జరుగుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్క చూసినా అరాచకాలు, విపరీతమైన అవినీతి పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఆర్థిక ప్రగతి కథనాలను ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజం చేశారు.

అసలు వాస్తవాలు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. ఏపీఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 79,758 మిలియన్ యూనిట్ల డిస్పాచ్ ఉండగా, 2025-26 నాటికి అది 78,546 మిలియన్ యూనిట్లకు పడిపోయిందని తెలిపారు. అలాగే విద్యుత్ అమ్మకాలు కూడా తగ్గాయని గుర్తుచేశారు. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు, గృహ వినియోగం పెరిగి పవర్ డిమాండ్ పైకి వెళ్లాలి. కానీ, ఏపీలో డిమాండ్ తగ్గడం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత మందగించింది చెప్పడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.

కేవలం విద్యుత్ డిమాండే కాకుండా, పన్ను ఆదాయాలు కూడా దారుణంగా పడిపోయాయని జగన్ ఎత్తిచూపారు. 2023-24లో రూ. 85,922 కోట్లుగా ఉన్న రాష్ట్ర సొంత పన్ను ఆదాయం.. 2025-26 నాటికి కేవలం రూ. 86,552 కోట్లకు మాత్రమే చేరిందని కాగ్ (CAG) నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. రెండేళ్లలో కేవలం 0.15 శాతం వృద్ధి రేటు మాత్రమే ఉండటం.. రాష్ట్రంలో వినియోగం, పెట్టుబడులు పూర్తిగా పడిపోయాయనడానికి నిదర్శనమని దుయ్యబట్టారు.

ఈ ఆర్థిక మందగమనం కారణంగా నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే తొలి త్రైమాసికంలో నాలుగో స్థానంలో, రెండో త్రైమాసికంలో మూడో స్థానంలో నిరుద్యోగంలో ఏపీ నిలిచిందని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. చంద్రబాబు మాత్రం 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వైఎస్ జగన్ ఎక్స్ (X) వేదికగా తీవ్రంగా విమర్శించారు.