రాప్తాడు సాహస విద్యార్థినికి జగన్‌ ఆర్థిక సాయం!

రాప్తాడులో జరిగిన దారుణ ఘటనలో తన స్నేహితురాల్ని కాపాడేందుకు సాహసం చేసిన విద్యార్థిని లక్ష్మికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. ఇటీవల జడ్పీ హైస్కూల్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మిని వైఎస్‌ జగన్‌ ఫోన్‌ ద్వారా పరామర్శించారు. ఆ సమయంలో ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మి కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు.

వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు గురువారం (నవంబర్ 12న) రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థిని లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మి తల్లిదండ్రులను పరామర్శించి, వైఎస్సార్‌సీపీ పార్టీ తరఫున రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. ఈ సాహస బాలికను అందరూ అభినందించాలని, పార్టీ తరఫున ఎప్పుడూ తోడుగా ఉంటామని భరోసా కల్పించారు.

ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ప్రధాన బాధితురాలు గోపికను కూడా వైఎస్సార్‌సీపీ ఆదుకోనుంది. గోపిక కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆ సహాయాన్ని కూడా బాధితురాలి కుటుంబానికి అందజేస్తామని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు.