‘జ‌గ‌నన్న సాయాన్ని ఎన్నటికీ మరిచిపోలేం’

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఒక లబ్ధిదారు కుటుంబం ఆప్యాయంగా కలుసుకుంది. నూజివీడు నియోజకవర్గం పరిధిలోని కొర్లగుంటకు చెందిన మహేష్‌, వినీల దంపతులు తమ చిన్నారి కుమార్తె ధన్సికతో కలిసి వైఎస్‌ జగన్‌ను నేరుగా కలిశారు. ఈ సందర్భంగా నాటి తమ అనుభవాలను గుర్తుచేసుకుంటూ వారు భావోద్వేగానికి గురయ్యారు.

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో.. అంటే 2019లో తమ కుమార్తె ధన్సిక కేవలం రెండు నెలల పసికసువుగా ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురైందని ఆ దంపతులు వివరించారు. ఆ క్లిష్ట సమయంలో ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం తమ కుటుంబానికి రక్షగా నిలిచిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద చిన్నారికి అత్యంత ఖరీదైన, క్లిష్టమైన న్యూరో సర్జరీ పూర్తిగా ఉచితంగా జరిగిందని వారు చెప్పారు.

నాటి ఆపరేషన్ విజయవంతం కావడంతో తమ కుమార్తె ప్రాణాలతో బయటపడిందని, నేడు ఎంతో ఆరోగ్యంగా ఎదుగుతోందని తెలిపారు. ఆపద్బాంధవుడిలా తమ కుటుంబానికి అందిన ఆ గొప్ప సహాయాన్ని జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేమని వారు పేర్కొన్నారు. తమ కుటుంబానికి చేసిన ఆపద సాయానికి వైఎస్‌ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేందుకే ఎయిర్‌పోర్ట్‌కు వచ్చామని చెప్పారు.

ఈ ఆప్యాయ కలయిక సందర్భంగా చిన్నారి ధన్సికను వైఎస్‌ జగన్‌ ఎంతో ప్రేమగా పలకరించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ తల్లిదండ్రులను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. పాపను ఆశీర్వదించి, భవిష్యత్‌లో బాగా చదువుకోవాలని అడవిగా సూచించారు. చిన్నారితో పాటు ఆ దంపతుల కోరిక మేరకు వైఎస్‌ జగన్‌ వారితో కలిసి సంతోషంగా సెల్ఫీ దిగారు.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా పేద కుటుంబాలకు అందుతున్న వైద్య సాయం ఎంతటి ప్రాణాలను నిలబెడుతుందో తమ కుటుంబమే ప్రత్యక్ష సాక్ష్యమని మహేష్ దంపతులు అన్నారు. తమకు జరిగిన ఈ ప్రాణభిక్షకు ఆ దేవుడితో పాటు వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతా పూర్వకంగా తెలిపారు.