వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులను, పోలీసులను దుర్వినియోగం చేసి గెలుపొందారని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో ఈ మేరకు ఆయన స్పందిస్తూ చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పించారు.
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి, ప్రజాబలంతోనే గెలిచామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, చంద్రబాబు ఒకటేనని అభివర్ణించారు. ఎప్పుడూ రిగ్గింగ్లకు పాల్పడే వ్యక్తి, నేడు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతుంటే ప్రజలు నివ్వెరపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా కూడా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. “గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, చంద్రబాబు ఒకటే! ‘రిగ్గింగ్ మాస్టర్’ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు! Hey Ram, Save Andhra!” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైఎస్సార్సీపీ నేతలు సైతం చంద్రబాబు ప్రభుత్వంపై ఇదే రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, బ్యాలెట్ బాక్సులను మార్చేశారని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు.

