16 నెలలు జైల్లో పెట్టారు… నన్ను హింసించినట్టుగా ఎవ్వరినీ కూడా చేసి ఉండరు అన్నారు మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్. అయినా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం అని…. కేసులు పెట్టడం మినహా టీడీపీ నేతలు చేయగలిగింది ఏమీ లేదు అని ఎద్దేవా చేశారు. రెడ్‌బుక్ అదేదో గొప్ప పని అన్నట్టు వ్యవహరిస్తున్నారు… ఇలా అయితే ప్రతి ఒక్కరూ ఒక బుక్ రాసుకుంటారు అని చురకలు అంటించారు.
మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు జగన్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు జగన్. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారు అని దుయ్యబట్టారు. గతంలో ప్రతి ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం… ఏ పథకానికి ఎంతో బడ్జెట్ కేటాయింపుల్లో స్పష్టంగా చెప్పాం కానీ టీడీపీ నేతలు మాత్రం అలా చేయలేకపోతున్నారన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అబద్ధాలు.. ఇప్పుడు మోసాలుగా మారుతున్నాయి… చంద్రబాబు మోసాలపై రోజురోజుకూ ప్రజల ఆగ్రహం పెరుగుతోందన్నారు. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. వ్యవసాయం, పెట్టుబడి సాయం కూడా పోయిందని మండిపడ్డారు జగన్. రాష్ట్రంలో ఎక్కడిపడితే అక్కడ క్లబ్బులు నడుస్తున్నాయి. మట్కా లాంటి వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయన్నారు.
దీనిపై ప్రజలు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు అని ఆరోపించారు జగన్. కేవలం నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని..వైసీపీ నేతలు ప్రజల తరఫున పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు జగన్.