- Advertisement -

డీఎస్సీ 2025 అక్రమాలపై జగన్ సంచలన ట్వీట్!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2025 రిక్రూట్‌మెంట్ కుంభకోణం రోజురోజుకూ బట్టబయలవుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు. అక్రమాలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కూటమి ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సాక్షి టీవీ, సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్ వంటి పేజీలను నిలిపివేయడం లేదా జియో-బ్లాక్ చేయడం దారుణమన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ సెన్సార్‌షిప్ అని దుయ్యబట్టారు.

ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారని జగన్ విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను కాలరాసే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదన్నారు. దమ్ముంటే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని చంద్రబాబును సవాల్ చేశారు. రిక్రూట్‌మెంట్‌లో నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తమ హయాంలో పరీక్షలు రాయకుండా, టెట్ అర్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చామంటూ చంద్రబాబు చేస్తున్న వాదనలను జగన్ తిప్పికొట్టారు. స్పోర్ట్స్ కోటా జీవోల పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సెన్సార్‌షిప్‌ను వెంటనే ఆపివేసి, తొలగించిన సోషల్ మీడియా ఖాతాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పోస్టులను డిలీట్ చేసినంత మాత్రాన నిజాలు దాగిపోవని, కూటమి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పితీరాలని జగన్ స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -