ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. జాబ్ ఫస్ట్ అనే నినాదం మంచిదే… కానీ రాష్ట్రంలో నిరుద్యోగం తారాస్థాయిలో ఉందన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో పరిశ్రమలు లేక యువత వలస వెళ్ళింది,…. వలస వెళ్లలేని వారు కేవలం రూ.8వేలు, రూ.10వేలు జీతానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు అన్నారు.
నిన్న చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు 40-50 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన బాబు చెప్పినట్లు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే…5 ఏళ్లలో 20 లక్షలు వస్తాయి అనుకుందాం. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితే మిగతా వాళ్ల సంగతి ఏంటి ? 20 కోట్ల ఉద్యోగాలు అని గతంలో మోడీ ప్రభుత్వం కూడా మోసం చేసిందన్నారు.
20 కోట్ల ఉద్యోగాలలో మనకు ఎన్ని వచ్చాయి ? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని మోడీకి ఎందుకు బాబు మద్దతు ఇస్తున్నారు ? రాష్ట్రంలో మీరు ఇచ్చే 20 లక్షలకు తోడు మరో 30 లక్షల ఉద్యోగాలు మోడీ ఇవ్వాలి. ఈ మేరకు బాబు కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. మోడీ,బాబు ఇద్దరు కలిసి కూర్చొని ఉద్యోగాల కల్పనపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల పరిధిలో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అన్నారు.