ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు మేయర్ అభ్యర్థులు, 20 మంది మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను పార్టీ ఖరారు చేసింది.
రాష్ట్రంలో మొత్తం 13 నగరపాలక సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆరు ప్రధాన నగరాల పేర్లపై తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, విజయవాడ, గుంటూరు, కర్నూలు కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఈ ఆరింటిని మినహాయించి, మిగిలిన ఏడు కార్పొరేషన్లకు పార్టీ అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటించింది.
పెండింగ్లో ఉన్న స్థానాల్లో కీలక పేర్లపై దాదాపు స్పష్టత వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ మేయర్ స్థానానికి తాజా మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేరును పరిశీలిస్తున్నారు. తిరుపతి మేయర్ అభ్యర్థిగా మాజీ మేయర్ డాక్టర్ శిరీష పేరు పరిశీలనలో ఉంది. కర్నూలు మేయర్గా మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ భార్య సుశీల పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. పెడన మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా కటకం నాగకుమారి పేరును ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
మిగిలిన ఆరు కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థుల జాబితాను పార్టీ శుక్రవారం విడుదల చేయనుంది. వీటితో పాటు మిగిలిన మున్సిపాలిటీల ఛైర్మన్ల పేర్లను కూడా పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించనుంది. ఈ ప్రకటనతో వైకాపా శ్రేణులు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.

