త్వరలో దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా ఉన్నారు. తెలంగాణలో మూడు, ఏపీలో ముగ్గురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణలో రెండు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్‌కు దక్కనుండగా ఏపీలో మాత్రం మూడు వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి.
వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర బాబు, బీజేపీ నుండి సీఎం రమేష్ పదవీ కాలం ముగియనుంది. ఈ ముగ్గురు 2024, ఏప్రిల్ 2 న పదవీ విరమణ చేయనున్నారు. ఇక ఏపీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజ్యసభకు వైసీపీ నుండి ఎవరిని పంపిస్తారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ఇక ఆశావాహులు ఇప్పటికే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధానంగా రాజ్యసభ రేసులో వైవీ సుబ్బారెడ్డి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్నారు. ఒక స్ధానంను మైనార్టీలకు ఇస్తారని ప్రచారం జరుగుతోండటంతో సినీ నటుడు అలీకి ఖాయమని తెలుస్తోంది. ఇక మూడో సీటుకు పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు ఇస్తారని తెలుస్తోంది. ఎన్నికల వేళ సామాజిక సమీకరణాల ఆధారంగానే రాజ్యసభ అభ్యర్దుల ఎంపిక ఉండనుండగా ఈ మూడు స్థానాలతో వైసీపీ బలం 11కి చేరనుంది. అలాగే ఏపీ నుం డి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా వైసీపీ సభ్యులే ఉండనున్నారు.