నిజాయితీతో కూడిన రాజకీయాలకు పెట్టింది పేరుగా.. తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకుంటుంటారు. అవినీతి అన్న మాట తమ డిక్షనరీలోనే లేదని కూడా సెలవిస్తుంటారు. మరి ఓటుకు నోటు కేసు సంగతి ఏంటని అడిగితే ప్రతిపక్షాల కుట్ర అని కూడా తప్పించుకుంటారు.
కానీ.. ఇప్పుడు టీడీపీ ఆఫీస్ లో జరుగుతున్నట్టుగా.. ప్రచారంలో ఉన్న ఓ వ్యవహారం.. ఆ పార్టీ నేతలను ఇరకాటంలో పడేస్తోంది.
సొంత నేతలే.. పార్టీ ఆఫీస్ సిబ్బంది చేతుల్లో దారుణంగా మోసపోతున్నారంటూ.. ప్రచారంలో ఉన్న ఓ వార్త.. సంచలనం సృష్టిస్తోంది. టెక్నాలజీకి పెద్దపీట వేసే చంద్రబాబు నాయుడు.. తన పార్టీ ఆఫీస్ లో.. ఉమ్మడి రాష్ట్రంలోని 42 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థ ఉందట. అందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి.. అవసరమైనప్పుడల్లా పార్టీ పరిస్థితిపై, నేతల పనితీరుపై నివేదిక తెప్పించుకుంటున్నారట.
ఈ వ్యవహారంలోనే.. పార్టీ ఆఫీస్ లో పనిచేసే ఆ ప్రత్యేక విభాగం సిబ్బంది అందినంతగా దండుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల నేతల నుంచి వీలైనంతగా దండుకుంటూ.. వారికి అనుకూలంగా రిపోర్టులు తయారు చేసి బాబుగారికి అందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరైనా పార్టీ పరిస్థితి గురించి ఆ ప్రత్యేక కేంద్రానికి వెళ్తే.. ఒకటికి పది సార్లు తిప్పించుకోవడమే కాదు.. వారి నుంచి సమయం చూసి జేబులు నింపుకొనే ప్రక్రియ కూడా దర్జాగా చేసేస్తున్నారని తెలుస్తోంది.
ఇదంతా బాబుకు తెలియదా అంటే.. ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒకవేళ తెలిసినా.. బాబు కూడా ఆ సిబ్బందిని మార్చలేకపోతే.. టీడీపీ పరిస్థితి దిగజారడం ఖాయమని కొందరు వార్నింగ్ ఇస్తున్నారు.