ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. పెద్ద హీరోనా చిన్న హీరోనా అన్న తేడా లేదు. సౌత్ , నార్త్ అనే బేధం లేదు. సినిమా ఏదైనా పాన్ ఇండియా మూవీ కావాల్సిందే. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా అగ్రహీరోల సినిమాలైతే ఓకే. కానీ ఎటు వచ్చి చిన్న హీరోల సినిమాలకే కష్టాలు తప్పడం లేదు. సుధీర్ బాబు నుండి సందీప్ కిషన్, రామ్ వరకు సినిమాలన్ని పాన్ ఇండియా మార్కెట్ అవుతున్నాయి.
పాన్ ఇండియాగా వచ్చే ప్రతీ సినిమా 5 భాషల్లో రిలీజ్ అవుతోంది. సినిమా ట్రైలర్ దగ్గరి నుండి సాంగ్స్ వరకు ప్రతి ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. అంతేగాదు పాన్ ఇండియా మూవీ అంటే జాతీయ స్ధాయిలో ప్రమోషన్స్ చేయాల్సిందే. ఇప్పుడు ఇదే నిర్మాతలకు భారంగా మారుతుంది. ఎందుకంటే అగ్రహీరోల సినిమాలకు ప్రమోషన్ కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ చిన్న హీరోల సినిమా ప్రమోషన్‌కు తడిసి మోపెడవుతోంది.
పబ్లిసిటీ నుండి మొదలు పెడితే చార్టెట్ ఫ్లైట్స్,లగ్జరీ హోటల్స్,మీడియా ఈవెంట్స్ ఇలా ప్రతీది ఖర్చుతో కూడుకుందే. ఇలా ప్రతి దానిని లెక్క కడితే ఓ తెలుగు సినిమాను నార్త్‌లో ప్రమోట్ చేయడానికి దాదాపు రూ. 15 కోట్ల ఖర్చు అవుతుందని టాక్.ఇంత మొత్తంలో బడ్జెట్ వెచ్చించడం నిర్మాతలకు పెను భారమే. ఈ లెక్కన చూసుకుంటే మిడ్ రేంజ్ హీరోల సినిమాలు పాన్ ఇండియా స్ధాయిలో విడుదల కావడం కష్టమే. మొత్తంగా ఇకపై పాన్ ఇండియా అంటే అగ్రహీరోలకే పరిమితం అవడం ఖాయమనే ప్రచారం నడుస్తోండగా ఏదిఏమైనా చిన్న హీరోలకు మాత్రం పాన్ ఇండియా మూవీ అందని ద్రాక్ష అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉందని సినీ రంగానికి చెందిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.