దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేసింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజారియా లతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. విచారణ సందర్భంగా ఓ న్యాయవాది తన వ్యక్తిగత సమస్యను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాను నివసిస్తున్న ప్రాంతం మొత్తం వీధి కుక్కలతో నిండిపోయి ఉందని, అవి రాత్రి అంతా ఒకదానినొకటి వెంటాడుతూ గందరగోళం సృష్టిస్తున్నాయని తెలిపారు. దీని వల్ల తనకు నిద్రలేమి సమస్య వచ్చిందని, పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని చెప్పారు. స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆయన వాపోయారు.
అనిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నిబంధనలు చాలా పరిమితంగా ఉన్నాయని, టీకాలు లేదా శస్త్రచికిత్స చేసిన తర్వాత అదే ప్రాంతంలో కుక్కలను వదిలేయాల్సి వస్తోందని న్యాయవాది పేర్కొన్నారు. అయితే భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువులను తొలగించే అధికారం స్థానిక సంస్థలకు ఉందని ఆయన వాదించారు.
సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కుక్కల దౌర్జన్యం తగ్గించడంలో శస్త్రచికిత్స ఉపయోగపడుతుందని, కానీ అనేక నగరాల్లో ఈ కార్యక్రమం సరిగా అమలు కావడం లేదని తెలిపారు. శస్త్రచికిత్స వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
స్టెరిలైజ్ చేయని వీధి కుక్కలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి ఆన్‌లైన్ వేదిక వంటి పబ్లిక్ మెకానిజం ఏర్పాటు చేయాలని భూషణ్ సూచించారు. ఆ ఫిర్యాదులు అధికారికంగా నమోదు చేసి, సంబంధిత అధికారులకు అప్పగించి వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పెద్ద సంఖ్యలో కుక్కలను షెల్టర్లలో ఉంచడం వల్ల అవి మరింత దౌర్జన్యంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీని నియమించాలని కోర్టును కోరారు.
వీధి కుక్కలపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను విమర్శిస్తూ మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణకు సమానమని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే న్యాయ సంయమనం దృష్ట్యా, ఆమెపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించడం లేదని స్పష్టం చేసింది.అలాగే ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వీధి కుక్కల సమస్య పరిష్కారానికి బడ్జెట్ కేటాయింపుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసు తదుపరి విచారణకు జనవరి 28కి వాయిదా వేసింది.
