తెలంగాణ ఉద్యోగులను చూస్తే ఎపి ఉద్యోగుల్లో కొద్దో గొప్పో అసూయ కలుగుతోందట. జీతాలపెంపు నుంచి అలవెన్సుల పెంపు దాకా ఉద్యోగులు అడిగినంతా ఇచ్చిన కెసిఆర్ ఎపి ఉద్యోగుల మనసుల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఉద్యోగులకు మరే రాష్ట్ర ప్రభుత్వమూ ఇవ్వని ప్రాధాన్యతనిస్తున్న కెసిఆర్ తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఏదో వెలితిగా అనిపిస్తోందట.
ఎంతసేపూ మీరెవ్వరూ పనిచేయడం లేదు. నేనొక్కణ్నే కష్టపడుతున్నా అని సొంత డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు కంటే కెసిఆర్ లాంటి సిఎం తమకూ ఉంటే బాగుండు అని వారు ఫీలవుతున్నట్లు టాక్!! అంతేకాదు ఉద్యోగులకు సెలవులివ్వడంలో కూడా కెసిఆర్ తన ఉదారత చాటుకుంటూ రావడం కూడా ఎపి ఎంప్లాయిస్ గమనిస్తున్నారు.
గోదావరి పుష్కరాల కోసం అహోరాత్రాలు శ్రమించిన తెలంగాణ ఉద్యోగులకు ఓ రోజు సెలవివ్వడం తర్వాత చిన్నదో పెద్దదో పండుగ వచ్చినా, పండుగ మరుసటిరోజు సెలవు కావాలని నోరు తెరిచి అడిగితే చాలు కెసిఆర్ ఇస్తున్నారు. ఎప్పుడూ లేనిది మొన్నటికి మొన్న క్రిస్మస్ తరువాతిరోజు బాక్సిండ్‌డేకు కూడా సెలవు ప్రకటించారు కెసిఆర్.
ఒక పండుగలనేమిటి.. ఎంజాయ్ చేయాల్సిన అకేషన్‌లో పని చేయించడం ఎందుకు అనే రీతిలో తాజాగా జనవరి 1న కూడా ప్రభుత్వ సెలవు ప్రకటించారు కెసిఆర్. ఇలా కెసిఆర్ ఉదారంగా ఇస్తున్న సెలవులను ఎంజాయ్ చేస్తున్న తెలంగాణా ఉద్యోగులను చూసి ఇక్కడే హైదరాబాద్‌లో తెలంగాణ ఆఫీస్‌లకు పక్కనే ఉన్న ఎపి ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉసూరుమంటున్నారట!
అందుకే ఎపి ఉద్యోగుల్లో కెసిఆర్‌పై గౌరవభావం అంతకంతకూ పెరిగిపోతోందని తెలుస్తోంది. కెసిఆర్‌తో ఈ మధ్య చెలిమి చేస్తున్న చంద్రబాబు కొన్నైనా ఆయన నుంచి అలవర్చుకుంటే బాగుండని అనుకుంటున్నారట! కనీసం ఉద్యోగుల విషయంలోనైనా చంద్రబాబు కెసిఆర్‌ను ఫాలో కావాలని వారు మనసులో కోరుకుంటున్నారు.
ఇవి జరుగుతాయన్న నమ్మకం లేదు కాబట్టి కెసిఆర్ మాకు సీఎం అయితే ఎంత బాగుండు అని ప్రస్తుతానికి కలలు మాత్రం కంటున్నారట. ఏదేమైనా ఇప్పుడు కెసిఆర్ తెలంగాణాలోనే కాదు ఎపిలో కూడా హీరోనే.