Thursday, May 8, 2025
- Advertisement -

నువ్కొకటంటే.. నేను రెండంటా..

- Advertisement -

అమరావతి పరిధిలో బినామీ భూముల గురించి విపక్షనేత చేసిన ఆరోపణలు అసెంబ్లీని కుదిపేశాయి. జగన్‌ చేస్తున్న ఆరోపణలను, సాక్షి కథనాలకు ఆధారాలు చూపాలని అధికారపక్షం డిమాండ్ చేసింది. సాక్ష్యాధారాలతో నిరూపిస్తే మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులపై తక్షణమే చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు సవాల్‌ విసిరారు. అయితే.. ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన జగన్… బినామీ భూములపై ఆరోపణలు సంధించడంతో సభలో చర్చ పూర్తిగా ఆ అంశంపైకి మళ్లింది. బినామీ పేర్లతో రాజధానిలో వేల ఎకరాలను అధికార పార్టీ నేతలు, మంత్రులు అక్రమంగా కొన్నారని జగన్ వ్యాఖ్యానించడంతో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకున్నారు. తనతో పాటు మంత్రులు నారాయణ, దేవినేని సహా మిగతా నేతలపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు.

తర్వాత మళ్లీ ప్రసంగం ప్రారంభించిన జగన్‌ తన ఆరోపణలను సమర్థించుకున్నారు. ఇదే సమయంలో జోక్యం చేసుకున్న సీఎం చంద్రబాబు జగన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. బినామీ పేర్లతో కొంటే, సర్వే నెంబర్లు, ఆధారాలతో సహా సభకు సమర్పించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు సభ ముందు పెడితే, తక్షణమే సదరు మంత్రులపై కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. లేదంటే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆరోపణలను రుజువు చేసిన తర్వాతే సభా వ్యవహారాలు ముందుకు సాగాలన్నారు బాబు.

మరోవైపు తన ఆరోపణలపై జగన్‌ ఏమాత్రం వెనక్కితగ్గలేదు. బినామీలపై తన ఆరోపణల్లో ఒక్కటీ అవాస్తవం లేదన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌లో ఇన్‌ సైడెడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు ఓత్‌ ఆఫ్ సీక్రసీని ఉల్లంఘించారన్నారు. దమ్ముంటే రాజధాని బినామీ భూముల వ్యవహారంపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు జగన్.

సీబీఐ ఎంక్వయిరీ పేరుతో రాజధాని ప్రతిష్టను మంటకలుపుదామనుకుంటున్నారా అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఏ విచారణకూ ఆదేశించేది లేదని.. రాజధాని కట్టి తీరతామని స్పష్టం చేశారు. తన తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని వేల కోట్లు జగన్ అక్రమంగా సంపాదించారని, అదే సొమ్ముతో  పేపర్, టీవీ పెట్టి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని చంద్రబాబు విమర్శించారు. తన మీద నమ్మకంతో  34 వేల ఎకరాలు రైతులిచ్చారని, ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తుండటంతో భూముల ధరలు తగ్గుతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారని చంద్రబాబు అన్నారు.

ఈ దశలో 329 నిబంధన కింద గవర్నర్ ప్రసంగంపై చర్చ ముగిసిందని యనమల తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు. అయితే బినామీ భూములపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్‌ ఎంత చెప్పినా వైసీపీ సభ్యులు మాట వినకపోవడంతో మంత్రి యనమల సదరు సభ్యులపై సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -