భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీమ్ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టంగా మారింది. గత వరల్డ్ కప్ తర్వాత నుంచి అతనికి జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. కొద్దికాలం పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు.
అయితే, ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్య అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. వరుసగా అర్ధశతకాలు సాధించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లోనే 60 పరుగులు బాదాడు. అలాగే గుజరాత్‌పై 29 బంతుల్లో 82 పరుగులు చేసి సత్తా చాటాడు.
అయినప్పటికీ అతనికి జాతీయ జట్టులో వెంటనే అవకాశం లభించే పరిస్థితి లేదు. భారత జట్టులో తీవ్రమైన పోటీ నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తాజాగా బీసీసీఐ వర్గాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.
ప్రస్తుతానికైతే సూర్యకుమార్ యాదవ్ తమ ఎంపిక ప్రణాళికల్లో లేడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. జట్టులో ఎక్కడ స్థానం కల్పించాలనేది పెద్ద ప్రశ్నగా మారిందని తెలిపాయి. యశస్వి జైస్వాల్కే పరిమిత ఓవర్ల జట్టులో చోటు కల్పించలేకపోతున్నామని వెల్లడించాయి.
మిడిలార్డర్లో కూడా ప్రస్తుతం విపరీతమైన పోటీ ఉందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్నప్పటికీ, జట్టులో ఖాళీలు లేకపోవడంతో సూర్య భాయ్ రీఎంట్రీ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని తెలుస్తోంది.

