ఎవరు ఏం చెప్పినా నమ్మొచ్చుగానీ… రాజకీయ నాయకుడు చెపితే మాత్రం నమ్మొద్దనే సామెత మనకు తెలిసిందే. నేతల మాటలకు అర్ధాలే వేరులే అని మనం తెలుసుకోవాలి లేదంటే మోసపోతాం.
అవునంటే… కాదనిలే, కాదంటే అవుననిలే అన్నట్లు ఫలానా పని కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా… అని ఏ నేతైనా చెప్పాడంటే ఖచ్చితంగా అది కావొద్దని ఆశిస్తున్నట్లు అర్ధం చేసుకోవాలి మరి. ఇంతకీ ఇప్పుడీ ఉపోద్ఘాతమెందుకనేగా మీ అసహనం. మన చంద్రబాబుగారూ మహానాడులో చేసిన ఓ డిమాండ్‌ను చూసిన తరువాత ఇదంతా గుర్తొచ్చింది.
మహానాడులో మన మహాఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత కూడా అయిన చంద్రబాబు గారు మరోసారి డిమాండ్ చేసిందేమిటయ్యా అంటే… ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి అంతే అని. దాంతోపాటు మరో నాలుగు ముక్కలు యాడ్ చేసి ఎన్టీఆర్‌ను ఆకాశానికి కూడా ఎత్తేశారు. తెలుగుజాతికి ఎన్టీఆర్ ఆరాధ్యదైవమన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పాటుపడిన వ్యక్తి ఎన్టీఆర్ అని కూడా అన్నారు చంద్రబాబు. ఇందులో తప్పేముంది అని మీరడొగొచ్చు. మహానాడు కొత్తగా చూస్తున్నవాళ్లకు ఇది కొత్తేనేమో కానీ… ప్రతి మహానాడులో చంద్రబాబుగారు నొక్కి వక్కాణించేది ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందేనని.
ఇదివరకు బిజెపి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన దగ్గర్నుంచీ అంటే వాజ్‌పేయి ప్రధాని అయినప్పటినుంచీ ప్రతి మహానాడులో చంద్రబాబుగారు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయటం, తీర్మానం చేయటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ మన చంద్రబాబుగారి ఫ్రెండ్‌షిప్ పార్టీ అదే పొత్తుపార్టీ బిజెపినే అధికారంలో ఉంది. మరి ఇప్పుడు కూడా డిమాండ్ చేశారు. తన సొంత పార్టీ సభ అయిన మహానాడులో తీర్మానమో, డిమాండో చేస్తే అది కేంద్రప్రభుత్వం చెవికి ఎలా ఎక్కుతుంది అన్న చిన్న విషయం మన చంద్రబాబుగారికి తెలియదా! కానీ… అదంతే ఆయన తీర్మానాలు, డిమాండ్‌లే చేస్తారు కానీ… కేంద్రానికి మాత్రం మా ఎన్టీఆర్‌గారికి భారతరత్న ఇవ్వాల్సిందే అని గాట్టిగా ఓ లెటర్ మాత్రం రాసిన పాపానబోరు.
అసలు ఎన్టీఆర్‌కు భారతరత్న రావడం చంద్రబాబుకే ఇష్టం లేదేమోనన్న అనుమానాలు కూడా కలుగుతుంటాయి ఒక్కోసారి. ఎందుకంటే… ఈ మధ్య తెలుగు ప్రజలు, టిడిపి కార్యకర్తల మనసుల్లోనుంచి ఎన్టీఆర్‌ను తీసేసే వ్యూహాలు కూడా చేస్తున్నారు గనక. అందుకే కదా! ప్రభుత్వ పథకాలను ఎన్టీఆర్ పేరు బదులు తనపేరు పెట్టుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు కూడా… అంతలా ఎన్టీఆర్‌ను మరిపింపచేయడానికి కంకణం కట్టుకున్నాయన ఎన్టీఆర్ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే భారతరత్నను మాత్రం ఎందుకు రానిస్తారు… అనేది ఆ కొందరి అనుమానం. ఈ అనుమానాలన్నీ అబద్ధాలే అని బాబుగారైనా గట్టిగా ఖండిస్తారా అదీ చూద్దాం.