మంత్రుల మీద ఎమ్మెల్యే ల మీద ఎప్పుడు పడితే అప్పుడు తన అసహనం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. నిత్యం వారిని తప్పు పట్టడం వారిదే తప్పు అని వేలెత్తి పబ్లిక్ లో చెప్పడం చేస్తున్నారు ఆయన. అయితే… మంత్రులు – ఎమ్మెల్యేలు – అధికారులు మాత్రం తామేమీ చేయలేకపోవడానికి కారణం చంద్రబాబేనని అంటున్నారు. చంద్రబాబు చెప్పింది చేయడానికి తమకేమీ అభ్యంతరం లేదని.. కానీ చెప్పింది చేయడానికి ఆయన టైమివ్వడం లేదని అసలు విషయం చెబుతున్నారు.
నిత్యం సమావేశాలు – సమీక్షలు అంటూ గంటలుగంటలు ఆయనే సమయం తింటుంటే ఇంకా తమకు టైమెక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.దీనికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రేనంటున్నారు సాక్షాత్తు టీడీపీ నేతలు. ప్రజాప్రతినిధులు – అధికారులు ప్రజల మధ్యకు వెళ్లాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి కావాల్సిన అవసరాలను గుర్తించి వాటిని సకాలంలో తీర్చాల్సిన బాధ్యత అధికారులు – ప్రజాప్రతినిధులపై ఉంది కాని ఇవి చేయటానికి వారికి సమయం లేకుండా చేస్తున్నది ముఖ్యమంత్రేనంటున్నారు.
ఉదయం లేచిన తర్వాత దాదాపు రెండు గంటలపాటు అధికారులు – ప్రజాప్రతినిధులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆ సమయమంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం వినాల్సిందే. ఎవరితో మాట్లాడటం కాని ఎవర్నీ కలవటం గానీ సాధ్యంకాదు. ఈలోగా మధ్యాహ్నం అవుతుంది. తర్వాత నియోజకవర్గంలోకి వెళ్లటానికి కాని ప్రజలను కలవటానికి గాని ప్రజాప్రతినిధులకు వీలుకాని పరిస్థితి. ఈలోగా ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు హాజరవటం ముఖ్యమంత్రి కార్యాలయంలో నిర్వహించే సమీక్షల్లో పాల్గొనటం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు చేరువ కాలేకపోతున్నారు. వారి అవసరాలను గుర్తించలేకపోతున్నారు. దీంతో ప్రజలు ప్రజాప్రతినిధులకు మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది.