కేరళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక సీనియర్ నేత ప్రవర్తించిన తీరు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కొల్లాం నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే బిందు కృష్ణ పట్ల సీనియర్ నాయకుడు చెరియన్ ఫిలిప్ ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే బిందు కృష్ణ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న చెరియన్ ఫిలిప్ ఆమెకు స్వాగతం పలికే క్రమంలో హద్దులు దాటి ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న బిందు కృష్ణకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించకుండా, ఆమెను బలవంతంగా హగ్ చేసుకునేందుకు చెరియన్ ఫిలిప్ ప్రయత్నించారు.
ఆయన ప్రవర్తనతో అసౌకర్యానికి గురైన బిందు కృష్ణ, సున్నితంగా ఆయన్ని పక్కకు నెట్టివేస్తూ చేతులు జోడించి నమస్కరించారు. అయినప్పటికీ, ఆయన మళ్ళీ ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. ఈ మొత్తం వ్యవహారం అక్కడ ఉన్న మీడియా కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. బిందు కృష్ణ అసహనంగా ముఖం పెట్టి అక్కడి నుంచి తప్పుకుంటున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళా ప్రజాప్రతినిధి పట్ల, అది కూడా పార్టీ కార్యాలయంలోనే ఇలాంటి ఘటన జరగడం శోచనీయమని నెటిజన్లు మండిపడుతున్నారు.ఈ ఘటనపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
