తెలంగాణలోని పట్టణ పేదలకు కెసిఆర్ ప్రభుత్వం వరం ఇచ్చింది. పట్టణాల్లో నివసిస్తున్న పేదలు రెండు లక్షల రూపాయల లోపు వార్షికాదాయం కలిగి ఉంటే వారికి రూపాయికే నల్లా కలెక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి ఆసరా పెన్షన్ అర్హత ఉత్తర్వులే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. దీనికి కారణం గతంలో తెల్ల రేషన్ కార్డులన్న వారిని అర్హులుగా గుర్తించే వారు.
ఇప్పుడవి లేకపోవడంతో అసరా పెన్షన్ అర్హతే రూపాయి నల్లాకు కూడా అర్హతగా పరిగణిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ పట్టణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్న పట్టణాలు, నగరాల్లో రూపాయి నల్లా పథకాన్ని వర్తింపజేస్తారు. ముందుగా 10 లక్షల నల్లాలను మంజూరు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా కలెక్షన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. పట్టణ సమస్యలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సలహా మేరకు ఈ కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీసుకున్నారు.