వైజాగ్: ప్రతిపక్షాలపై ఎప్పుడూ తనదైన శైలిలో విమర్శలు చేసే వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైసీపీ ఆదివారం నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఎపీలో ప్రతిపక్షమే లేదన్న నారా లోకేశ్ కామెంట్స్‌కు ఆమె ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు.
కామెడీ ఆర్టిస్ట్‌కు ఎక్కువ, కామెడీ విలన్‌కు తక్కువ అన్నట్టు నారా లోకేశ్ తయారయ్యారని విమర్శించారు రోజా. కేంద్ర మంత్రి వెంకయ్య, ఏపీ సీఎం చంద్రబాబు వెన్నుపోటు బ్రదర్స్‌గా మారారని, వారికి తగిన బుద్ది చెప్పాలని అన్నారామె. ప్రత్యేక హోదా కోసం అంతా జగనన్న వెంట నడవాలని పిలుపునిచ్చారు. హోదా కోసం తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ప్రకటించారని, చంద్రబాబు టీడీపీ ఎంపీలతో అలా చేయించగలరా అని సవాల్ చేశారు. జై ఆంధ్రప్రదేశ్ సభతో అధికార పార్టీ నేతలు వణికిపోతున్నారని విమర్శించారు రోజా.