రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులా?, వాటిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? అని వైసీపీ పుత్తా శివశంకర్ రెడ్డి ప్రశ్నించారు. ఏ పరిశ్రమ ఎప్పుడొచ్చింది? ఎక్కడొచ్చింది?.. వాటి ద్వారా ఎంత మందికి ఉపాధి లభించింది? చెప్పాలన్నారు. పెట్టుబడి ఎంత, ఉత్పత్తి సామర్థ్యం ఎంతో చెప్పగలరా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని పెట్టుబడుల వివరాలను సచివాలయాల్లో ప్రదర్శించగలరా?, అశోక్ లీలాండ్ యూనిట్ 2018కు ముందే ప్రారంభం అయినా ఇప్పుడు మొదలైనట్లు లోకేష్ ఆర్భాటం చేయడం సరికాదన్నారు. తన శాఖ కాకపోయినా పబ్లిసిటీ కోసం లోకేష్ ఆరాటపడుతున్నారన్నారు.
గవర్నర్ ప్రసంగంలో రూ. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని చెప్పుకున్నారు. నెల కూడా గడవక ముందే, రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు. ఈ వ్యవధిలోనే రూ.50 వేల కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పాలన్నారు. ఎక్కడెక్కడ, ఎంతెంత పెట్టుబడులతో ఏయే పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? వాటి ద్వారా ఎంత మందికి ఉపాధి లభించింది? అన్న పూర్తి వివరాలు ప్రకటించాలి అని డిమాండ్ చేశారు.
విజయవాడ సమీపంలోని ఏపీఐఐసీ కారిడార్‌లో 2018కి పూర్వమే అశోక్ లీలాండ్ యూనిట్ ప్రారంభం కాగా, ఆ తర్వాత కోవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి కూడా తగ్గింది. కానీ నారా లోకేష్ చేసిన అతి చూస్తే 2024లో తాము అధికారంలోకి వచ్చాకే, ఆ యూనిట్ ఏర్పాటైనంత బిల్డప్ ఇచ్చారు అని ఆరోపించారు.
