ప్రియుడికి వీడియో కాల్‌ చేసి యువతి బలవన్మరణం!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోకపోతే చనిపోతానంటూ ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ప్రియుడికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు కంగారుగా ఆమె నివాసానికి చేరుకునే సరికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

మృతురాలు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అర్చనాచౌదరి మాలిక్‌ (29)గా గుర్తించారు. ఆమె మాదాపూర్‌ చందానాయక్‌ తండాలోని ఎస్‌ఆర్‌ రెసిడెన్సీలో నివసిస్తోంది. నగరంలోని ఒక ప్రైవేటు సంస్థలో సీనియర్‌ అసోసియేట్‌గా ఆమె పనిచేస్తోంది. బొల్లారంలో ఉండే ఉత్తరాఖండ్‌కు చెందిన సహోద్యోగి భండారి విమల్‌తో ఆమెకు నాలుగేళ్లుగా సాన్నిహిత్యం ఉంది. విమల్‌కు అప్పటికే వివాహం జరిగింది.

శనివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో విమల్‌ తన తల్లితో కలిసి శుభకార్యం నిమిత్తం చేర్యాలకు వెళ్తున్నాడు. ఆ సమయంలో అర్చన అతనికి వీడియో కాల్‌ చేసింది. ఫ్యాన్‌కు కట్టిన చున్నీని చూపిస్తూ తనను పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని హెచ్చరించింది. ఆ తర్వాత వెంటనే కాల్ కట్ చేసింది. విమల్‌ ఆందోళనతో పలుమార్లు తిరిగి ఫోన్‌ చేశాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

విమల్‌ హుటాహుటిన ప్రయాణాన్ని రద్దు చేసుకుని తెల్లవారుజామున 5.30 గంటలకు ఆమె ఫ్లాట్‌కు చేరుకున్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే అర్చనాచౌదరి ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనపై రాయదుర్గం క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్చనను పెళ్లి చేసుకునేందుకు విమల్‌ తన భార్యతో విడాకులకు ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.