పార్టీ బలోపేతం కోసం ఈమధ్యన జిల్లాల వారీగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు వైకాపా నేత జగన్ మోహన్ రెడ్డి. ఆయన ఇప్పుడు తన ప్రణాళిక లో భాగంగా కొత్త జిల్లాని ఎంచుకున్నారు. ఒంగోలు లోని కొన్ని నియోజికవర్గాలలో తమ పార్టీ బలహీనంగా ఉంది అని ఆ చోట కాంగ్రెస్ మాజీ ముఖ్యనేతలని తమ పార్టీలో కలుపుకోవడం కోసం జగన్ పావులు కదుపుతున్నారు అనే చర్చ నడుస్తోంది. పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలోని నరసరావుపేటకు చెందిన మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఈ చర్చ జోరందుకుంది.
ఒంగోలు జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు జిల్లాలో ఉన్న నేపథ్యంలో వారిని తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందా అన్న చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ నాయకులు వైసీపీలోకి చేరితే ఆయా నియోజకవర్గాల్లో పార్టీబలం పెరిగే అవకాశం ఉందన్న వాదన ఆ పార్టీ నేతల నుండే వినిపిస్తుంది. ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గం నుండి మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకుంటే ఆ నియోజకవర్గంలో పార్టీ పరుగులు పెడుతుందన్న వాదన వినిపిస్తోంది.
గతంలోనే వైకాపాలో మానుగుంట చేరతారన్న ప్రచారం ముమ్మరంగా సాగింది. కాని అనివార్య కారణాల వలన ఆయన వైకాపా తీర్థం పుచ్చుకోకపోవటంతో అధిష్టానవర్గం కందుకూరు నియోజకవర్గం వైకాపా ఇన్చార్జిగా తుమాటి మాధవరావును నియమించింది. దీంతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. త్వరలో కందుకూరు మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగితే మహీధర్ రెడ్డి తన స్వంత ప్యానల్ ను పోటీలోకి దించే అవకాశాలున్నట్లు సమాచారం. దీంతో మునిసిపల్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఈ నియోజకవర్గంలో రాజకీయాలు తారుమారుఅయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా మహీధర్ రెడ్డి వైకాపా గూటికి చేరితే మాత్రం ఆ పార్టీ బలం నియోజకవర్గంలోనే కాకుండా ఇతర నియోజకవర్గాలపై కూడా ఆయన ప్రభావం చూపే అవకాశాలున్నాయి.