ఆంధ్రప్రదేశ్ గిరిజన మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం తన రాజీనామా లేఖను సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రకు అందజేశారు. రాజ్యాంగం ప్రకారం చట్టసభలకు ఎన్నికకాని వారు మంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలల్లో చట్టసభలకు ఎన్నిక కాలేదు.దీంతో పదవికి రాజీనామా చేయాలని గవర్నర్ నరసింహన్ కోరారు. చంద్రబాబు కూడా పదవికి రాజీనామా చేయమని సూచించడంతో శ్రవణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాజీనామాకు ముందు శ్రవణ్ అమరావతికి వెల్లి మంత్రి నారాలోకేష్‌తో చర్చలు జరిపారు.ఆ తర్వాతే శ్రవణ్ రాజీనామా చేయాలనే నిర్ణయించుకొని.. ఆ లేఖను ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల దాడితో మరణించారు. అనంతరం ఆయన కుమారుడు కిడారి శ్రవణ్ అనూహ్యంగా రాజకీయ అరంగ్రేటం చేశారు. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆయనకు వైద్యఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమశాఖ మంత్రిత్వ బాధ్యతలను అప్పజెప్పారు చంద్రబాబు.
కిడారి శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మే 10 నాటికి 6 నెలలు నిండుతుంది. ఆ తర్వాత ఆయన మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం. ఈనేపథ్యంలోనే గవర్నర్ ఆదేశాల మేరకు మంత్రి పదవికి రాజీనామా చేశారు కిడారి శ్రవణ్.
