మాకు ప్రజలే ముఖ్యం. పార్టీలు.. వ్యక్తులు మాకు ముఖ్యం కాదు. ప్రజల కోసమే మేం నిరంతరం పోరాడుతాం అని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. బుధవారం నాడు హైదరాబాద్ లో సమావేశమైన జెఎసి సభ్యులు పలు అంశాలపై చర్యించారు. అనంతరం కోదండరామ్ విలేకరులతో మాట్లాడుతూ జెఎసిని గ్రామస్ధాయిలో పటిష్టం చేస్తాం.
ఎవరు ఎలాంటి దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదు అని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, కులవ్రత్తులు, ఓపెన్ కాస్ట్ వంటి సమస్యలపై పోరాడతామని ఆయన అన్నారు. ఓపెన్ కాస్ట్ లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయిస్తామని, నిజాం షుగర్స్ తోపాటు తెలంగాణలో మూత పడ్డ పరిశ్రమలన్నింటిని తెరిపిస్తామని కోదండరామ్ అన్నారు. విద్యార్ధులపై పోలీసులు జులం చేస్తున్నారని, దీన్ని చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు.
ఇక మల్లన్న సాగర్ నిర్వాసితులకు అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారం కోసం గజ్వేల్ లో ఓ సదస్సును నిర్వహించనున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మ మిషన్ భగీరధతో పాటు ఇతర కాంట్రాక్ట్ లన్నీ వెబ్ సైట్ లలో పొందుపరచాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలవాలని రెండు సార్లు ప్రయత్నించానని, ఆయన అపాయింట్ మెంట్ తనకు దొరకలేదని ఆయన అన్నారు. తనపై విమర్శలు చేసిన వారి భాష లాంటి భాష తనకు రాదని ఆయన అన్నారు.