కృత్రిమ మేధ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేసి సృష్టించే డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖ నటీమణులు ఇలాంటి ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ కంటెంట్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కొందరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ, ఈ దుశ్చర్యలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా ఈ సాంకేతిక మాయాజలానికి అందాల భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) బలయ్యారు. ఇటీవల ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పేజ్‌లో మృణాల్‌కు సంబంధించిన మార్ఫింగ్ చేసిన డీప్‌ఫేక్ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. ఎంతో వేగంగా వైరల్‌గా మారిన ఈ ఫొటోలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి.
తన మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటాన్ని గమనించిన మృణాల్ ఠాకూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ తన ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘‘నా అనుమతి లేకుండా నా డీప్‌ఫేక్ ఫొటోలను క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఇలాంటి నీచమైన పనులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ పోస్టులను పెట్టినవారు తక్షణమే వాటిని తొలగించాలి. లేనిపక్షంలో చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’’ అంటూ ఆమె తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా, ఇకపై ఈ ఫొటోలను ఎవరైనా సరే షేర్ చేసినా, రీపోస్ట్ చేసినా వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.
గతంలో రష్మిక మందన్నతో పాటు పలువురు ప్రముఖ హీరోయిన్లు ఇలాంటి డీప్‌ఫేక్ బాధితులుగా మారినప్పుడు సెలబ్రిటీలు తీవ్రంగా స్పందించారు. టెక్నాలజీని ఇలా తప్పుదారి పట్టించడం అత్యంత హేయమైన చర్య అని, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ కొందరు ఆకతాయిలు మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సెలబ్రిటీల ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మృణాల్ అభిమానులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
