ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తప్పవు. రెండేళ్ల క్రితం బీజం పడిన బంధానికి బీటలు వారక తప్పదు.బీజేపీ, టీడీపీ బ్రేకప్ కూడా తప్పదు. అయితే ఎప్పుడు..ఎలా..ఏ సందర్భంలో అన్నదే తేలాలి..ఇదీ ప్రస్తుత రాజకీయాలు పరిశీలిస్తున్న వారిలో అత్యధికుల మాట. చాలాకాలంగా ప్రధాని మోడీకి, సీఎం బాబుకి మధ్య సఖ్యత లేదు. అయినప్పటికీ రాజకీయ అవసరాల కోసం ఒకరినొకరు పొగుడుతూ, పొగిడించుకుంటూ కాలం గడుపుతున్నారు.
అందుకే అన్యోన్యంగా సాగాల్సిన స్నేహం ఇలా అతుకుల బొంతలా మారిన నేపథ్యంలో ఎక్కువకాలం కలిసి సాగడం కష్టమేనన్న నిర్థారణకు వచ్చేశారు. దానికి తగ్గట్టుగానే ఇద్దరి చేతలు ఉన్నాయి. అయితే ఎవరికి వారు తమ చేతికి మట్టి అంటకుండా తన వ్యతిరేకులను తరిమేద్దామని ఆలోచిస్తున్నారు. అందుకే ఈ బంధం బ్రేకప్ గా మారడానికి సమయం పడుతోంది. ఇంకా కొంత కాలం ఇదే రీతిలో సాగే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల సమయానికి ఆనాటి పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే నరేంద్రమోడీకి ఇప్పుడు గడ్డు కాలం మొదలవుతోంది. వరుసగా ఢిల్లీ, బీహార్ ఓటముల తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క రాష్ట్రంలో కూడా మోడీకి గెలుపు లేకపోతే ఆ తర్వాత ప్రధానికి పెను కష్టాలు తప్పవు. ఇప్పటికే రాజ్యసభలో ప్రభుత్వాన్ని విపక్షాలు రాచిరంపాన పెడుతున్నాయి. మోడీ మింగలేక కక్కాలేక అన్న చందాన సాగుతున్నారు. ఇక ఇప్పుడు ఆశలు పెట్టుకున్న అస్సాం దక్కకపోతే ఆతర్వాత యూపీ, హెచ్పీ, పంజాబ్, చివరకు గుజరాత్ వంటి చోట్ల కూడా గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించడం ఖాయం. అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్న మోడీ మిత్రపక్షాల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. శివసేన వంటి వారు సూటిపోటి మాటలు విసురుతున్నా స్పందించలేకపోతున్నారు. అయినప్పటికీ ఏపీ సీఎం విషయంలో మాత్రం మోడీ వెనక్కి తగ్గడం లేదు. ఏపీలో చంద్రబాబు ఇమేజ్ దాదాపు డ్యామేజ్ అయిపోయిందన్న అంచనాలో కేంధ్రం పెద్దలు ఉన్నారు. అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి సింగిల్ డిజిట్ దాటే అవకాశం లేదన్న లెక్కలు వేస్తున్నారు.
దాంతో సింగిల్ డిజిట్ పార్టీకి పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్న అంచనాకు వచ్చేశారు. దానికి తగ్గట్టుగానే బాబు అండ్ కోతో కేంధ్రం వ్యవహారాలు నడుస్తున్నాయి. మొన్నటి వరకూ వెంకయ్య చొరవతో కొంత సర్థుబాటే సాగేది. కానీ ఇప్పుడు వెంకయ్యకు కూడా మోడీ దగ్గర విలువ తగ్గిపోతున్న తరుణంలో ఇక అలాంటి అవకాశం కూడా ఉండదని అర్థమవుతోంది. చివరకు ఇన్నాళ్లుగా వెంకయ్య నాయుడి మాట మీద నాన్చుతూ వస్తున్న ప్రత్యేక హోదా విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు పార్లమెంట్ లో తేల్చేయడం వెనుక మారిన రాజకీయాలే కారణమని ఢిల్లీ వర్గాల సమాచారం.చంద్రబాబు మాత్రం బీజేపీ పట్ల ఇంకా వెనకాముందూ అడుతున్నట్టు సమాచారం. మోడీ నుంచి ఎటువంటి సహకారం అందకపోయినా , కమలంతో కలిసే సాగాలని ఆయన భావిస్తున్నారు. దానికి భిన్నంగా బీజేపీని కాదని ముందుకెళితే గతంలో జగన్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన అనుభవం ఆయన కళ్లముందు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఏపీలో ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అంటూ ఆయన మీద సాగుతున్న ప్రచారం నేపథ్యంలో కేంధ్రంతో కయ్యానికి ఆయన సిద్దంగా లేరు. అందుకే ప్రజలు, ప్రతిపక్షం నిలదీస్తున్నా తాను మాత్రం పల్లెత్తు మాట అనుకుండా కాలయాపన చేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు పెద్ద అడ్డంకి అంటూ విమర్శలు వస్తున్నా ఎదురుదాడితో కాలయాన చేయడం తప్పితే గట్టిగా తేల్చుకునే పట్టుదలకు పోవడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ, టీడీపీ బంధం కమలనాధుల కన్నా చంద్రబాబుకే ఎక్కువ అవసరం అన్న రీతిలో కనిపిస్తోంది. సరిగ్గా దానినే బీజేపీ కేంధ్ర, రాష్ట్ర స్థాయి నేతలు అవకాశంగా మలచుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేయడమే కాకుండా , పోలవరం, అమరావతి వంటి విషయాల్లో శ్వేతపత్రం కోసం నిలదీస్తున్నారు. అయినప్పటికీ టీడీపీకి ఎటూ పాలుపోవడం లేదు. ఈ పరిణామాలన్నీ కలిసి కథను 2019 వరకూ నడిపించే ప్రయత్నం మాత్రం సాగుతోందని స్పష్టంగా చెప్పవచ్చు.