- సభల్లో ప్రస్తావనకు రాని ఏపీ కవులు, రచయితల పేర్లు
- తెలుగు మహాసభలపై మండిపడుతున్న ఏపీవాసులు
- తెలంగాణ మహాసభలుగా పేరు మార్చుకోవాలని హితవు
ప్రపంచ తెలుగు మహాసభల పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా ఓ వేడుక నిర్వహిస్తోంది. కోట్లు కుమ్మరించి హైదరాబాద్‌న్నంతా సింగారించి ఈ వేడుకలను నిర్వహిస్తోంది. దీనికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావులకు ఆహ్వానం పలికారు. ప్రారంభ సమావేశాలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
అయితే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భాష తెలుగు కాదా అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా, బాహాటంగా కూడా ఈ సభలపై చర్చించుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో మాట్లాడే భాష కాదా? అక్కడ తెలుగు కవులు, రచయితలు లేరా? వారి ప్రస్తావన పేర్ల వరకైనా లేదే? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు అని పక్క రాష్ట్రం వారిని పిలవనప్పుడు తెలంగాణ తెలుగు మహాసభలు అని పేరు పెట్టుకోవచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవులు, రచయితలు, సాహితీవేత్తలకు కాకున్నా కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందించకపోవడం దారుణంగా పరిగణిస్తున్నారు. రాష్ట్రాలుగా విడిపోదాం.. తెలుగు వారిగా కలిసి ఉందాం అని చెప్పిన కేసీఆర్ ఇదేనా పద్ధతి అని మండిపడుతున్నారు. రాష్ట్రాలుగా వేరయ్యాం.. మరీ తెలుగు వారిగా కలిసుందాం అనే మాటను నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని గమనించిన ఏపీకి చెందిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ కవులు, రచయితల పేర్లను గుర్తుచేసి కేసీఆర్‌ను ఇరుకున పెట్టారు. ఏపీలో ఇలా ఉంటే తెలంగాణలో మాత్రం ఇంకో పరిస్థితి ఉంది.
ఈ సభలు కేవలం కేసీఆర్ గొప్పతనం చెప్పుకోవడానికి తప్ప తెలుగు భాష కోసం కాదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు అని చెబుతున్నా.. కేసీఆర్ వ్యక్తిగత కార్యక్రమంగా… టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా మారిందని ఆరోపిస్తున్నారు. హంగు ఆర్బాటాలు చేశారు తప్ప తెలుగు సాహిత్యంలో పేరు మోసిన అభ్యుదయ కవులను కనీసం గుర్తు చేసుకోకపోవడంపై అభ్యుదయవాదులు, వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.