తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మీద తెలంగాణా టీడీపీ నేత రేవంత్ రెడ్డి కొత్త విమర్సానాస్త్రాలు సంధించారు. అసంబ్లీ లో వాస్తవాలు మాట్లాడడానికి ప్రతిపక్షాలకి అవకాశం కూడా ఇవ్వని కెసిఆర్ షోలే లో గబ్బర్ సింగ్ తరహా లో తయారు అయ్యారు అని ఆయన ఎద్దేవా చేసారు. ప్రతిపక్షాలకు రెండు – మూడు నిమిషాలకు మించి అవకాశం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలకే కాకుండా ఆయా శాఖల మంత్రులకు కూడ సంబంధిత శాఖపై చర్చ జరిగినప్పుడు కూడ కేసీఆర్ కుటుంబీకులు మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు.
అసెంబ్లీ లో త్రీ మ్యాన్ షో నడుస్తోందని రేవంత్ ఆక్షేపించారు. కేసీఆర్ – కేటీఆర్ – హరీశ్ రావులే ముఖ్యమైన అన్ని అంశాలపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హరితహారం గురించి మంత్రి జోగు రామన్న మాట్లాడాల్సి ఉండగా ఆయనకు బదులుగా సీఎం కేసీఆర్ మాట్లాడారని – భూసేకరణ బిల్లుపై రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ మాట్లాడాల్సి ఉండగా ఆయనకు బదులు హరీశ్ రావు మాట్లాడరని చెప్పారు.
అలాగే రోడ్లు – వంతెనలపై సంబంధిత మంత్రి తుమ్మల మాట్లాడాల్సి ఉండగా ఆయనను పక్కనపెట్టి కేసీఆర్ మాట్లాడగా…మిషన్ భగీరథపై మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడాల్సి ఉండగా కేటీఆర్ మాట్లాడారని రేవంత్ రెడ్డి వివరించారు. మంత్రులకు ఏం మాట్లాడలన్న సోయి లేదని సిఎం ఆయన కుటుంబీకులే మాట్లాడుతున్నారా అని రేవంత్ నిలదీశారు. సభను ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు – మంత్రులకు కూడ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలుగా ప్రజల వాణిని వినిపించటానికి అవకాశం ఇవ్వని ప్రభుత్వం ఆఖరుకు మంత్రులకు కూడ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి విమర్మించారు. మంత్రులకు సోయి లేదని సీఎం అనుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.