ఆయన అనుకున్నది మాట్లాడలేకపోతున్నారు. అలాగని మాట్లాడేంత స్వేచ్ఛను తీసుకోలేకపోతున్నారు. కారణం అధినేతే అయినా… ప్రశ్నించే పరిస్థితి లేదు. అదేనండీ.. టి.దేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురించే చెప్తున్నది! ఆయన తీరు ముఖ్యంగా అనుచరులకు అర్థం కాకుండా పోతోందట. రేవంత్‌రెడ్డి పొలిటికల్ కెరీర్ ఎటువైపు పయనిస్తోందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారిందని వారే వాపోతున్నట్టు సమాచారం. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ నుంచి తెరాసకు ఈ మధ్య వలసలు బాగా ఎక్కువైపోయాయి.
ఈ నేపథ్యంలో త్వరలో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. పోనీ, ఉన్నవారితోనైనా పార్టీని ఎలాగోలా ముందుకు నడిపించి ఎన్నికల్లో ఎంతోకొంత ప్రభావం చూపుదామన్నా…ఆ అవకాశం కూడా మసకగానే కనిపిస్తోంది. ఎందుకంటే, తెరాస అధినేతతో చంద్రబాబు తరచూ సమావేశాలు అవుతూ ఉంటే క్షేత్ర స్థాయిలో మేం చేసేది ఏముంటుంది అనే అభిప్రాయం కార్యకర్తల నుంచి వ్యక్తం అవుతున్నట్టు చర్చ జరుగుతోంది.
ఇక, ఇదే తీరుగా రేవంత్ అనుచరులు కూడా అంటున్నారట! ముఖ్యమంత్రిని కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి విమర్శించే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది. దానికి కారణం చంద్రబాబు తీరు అనేది వారు బయటకు చెప్పకపోయినా బయటపడుతున్న అభిప్రాయం. తెరాసను తన వాక్చాతుర్యంతో ఇబ్బందిపెట్టే రేవంత్‌రెడ్డికి ఇప్పుడు ఆ స్వేచ్ఛ లేకుండా పోయిందనీ, ఇలా అయితే రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అనుచరులు వాపోతున్నారట.
కొంతమంది అయితే… రేవంత్ పార్టీ మారితే బెటర్ అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారట. అయితే, ఇదే అదను అనుకొని ఇతర పార్టీల వారు కూడా రేవంత్ పార్టీ మారాతారట కదా అనే పుకార్లను ప్రచారంలోకి తీసుకున్నారు! త్వరలోనే రేవంత్ తెలుగుదేశం పార్టీని వీడిపోతారని ప్రచారం జరుగుతోందని రాజకీయ వర్గాల్లో కూడా ఈ మధ్య ఓ అభిప్రాయం చక్కర్లు కొట్టింది. పార్టీ నాయకత్వం తీరుపై రేవంత్ కాస్త అసంతృప్తిగా ఉన్న మాట వాస్తమేగానీ, దాని తీవ్రత పార్టీని వీడే స్థాయికి చేరుకుందా లేదా అనేది మాత్రం ఇంకా అనుమానమే.
అయితే, కొంతమంది మాత్రం ఈ పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకుని మరో అడుగు ముందుకేసి రేవంత్‌కే ఫోన్ చేసి.. ‘మీరు తెలుగుదేశం వీడిపోతున్నారట నిజమేనా? కాంగ్రెస్‌లోకి చేరతారంట కరెక్టేనా..? ’ అని అడుగుతున్నారట! ఈ తీరు చూస్తుంటే ఏదో ఒక విధంగా రేవంత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, సొంత పార్టీలోనూ రేవంత్ అనుచరుల్లోనూ కూడా దేశం నాయకత్వం తీరుపై అసంతృప్తి అంతర్లీనంగా ఉన్న ఈ సందర్భంలో ఇలా రెచ్చగొడితే రేవంత్ దేశం నుంచి బయటకి వచ్చేస్తారన్న వీక్ పాయింట్‌పై ప్రచారం సాగిస్తున్నట్టు పొలిటికల్ గాసిప్స్ వినిపిస్తున్నాయి.
మరి, వీటిల్లో నిజం పాళ్లు ఏమాత్రమో తెలీదుగానీ… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా రేవంత్ రెచ్చిపోయే అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. నచ్చినా నచ్చకపోయినా… రేవంత్ నోరును తాత్కాలికంగా నొక్కేసినా కూడా కొన్నాళ్లపాటు ఆయన దేశంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు! ఎందుకంటే… భావోద్వేగాలకు ఊగిపోయి తొందరపాటు నిర్ణయాలు ఏవైనా తీసుకుంటే ఓటుకు నోటు కేసు మళ్లీ వెనక్కి వచ్చే అవకాశాలు ఉండవనే గ్యారంటీ ఏముంది..?