తెలంగాణా అధికారపక్షం తెరాస చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష దెబ్బకి తెలుగు దేశం పార్టీ ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలిసిందే, దాదాపు 13 మంది ఎమ్మెల్యే లు సైకిల్ దిగి గులాబీ కారు ఎక్కేసారు. ఈ వ్యవహారం జరిగి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. తెలంగాణా లో తెలుగు దేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఈ వ్యవహారం మీద ఇన్నాళ్ళ తరవాత న్యాయ పోరాటం అంటూ బయలుదేరడం ఆశ్చర్యంగా ఉంది.
జంపింగ్ చేసిన వాళ్ళ మీద ఇప్పటి వరకూ నేరుగా ఫిర్యాదు చెయ్యని ఆయన టీడీపీ శాసనసభ పార్టీని టీఆర్ ఎస్ శాసనసభ పార్టీలోకి ఎలా విలీనం చేస్తారంటూ న్యాయపోరాటానికి దిగారు. తెలంగాణ శాసనసభ కార్యదర్శి మార్చి 10న జారీ చేసిన బులిటెన్ లో పేర్కొన్న అంశాల్ని ఆయన సవాల్ చేశారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరటం ఒక ఎత్తు అయితే..
తమ శాసనసభాపక్ష పార్టీ తెలంగాణ అధికారపక్షంలో విలీనం అయినట్లుగా అసెంబ్లీ స్పీకర్ ఎలా గుర్తిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా హైకోర్టులో రేవంత్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ప్రతివాదులుగా పేర్కొన్న 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులు జారీ చేసిన వారిలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయంసాధించి.. టీఆర్ ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలంతా ఉన్నారు.