పెద్ద ఎత్తున జనసందోహంతో నిండిపోతున్న బ్యాంకుల దగ్గరరద్దీ నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుందని భావించినా అలాంటి దాఖలాలు ఏమీ కనిపించని పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మార్పురావాలంటే కనీసం 20 రోజులు పడుతుందని ఆర్థికమంత్రే స్వయంగా చెబుతుంటే రద్దీ లెక్కలపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలు మారిపోతున్నాయి.
ఇదిలా ఉంటే.. బ్యాంకుల రద్దీ కారణంగా ప్రజలే కాదు.. ఘనత వహించిన పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారట. తమ కోసం ఏర్పాటు చేసిన బ్రాంచ్ లో తమను కాకుండా మరెవరినీ అనుమతించకూడదని వారు కోరుతున్నారట. అందరూ సమానమే అయినా.. సమానుల్లో అత్యధికుల్లాంటి పార్లమెంటు ఎంపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వీలుగా.. దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ఎస్ బీఐ బ్రాంచ్ ఉంది. అయితే.. ఈ బ్రాంచ్ ను ఇప్పటివరకూ ఎంపీలతో పాటు.. పార్లమెంటులో పని చేసే సిబ్బంది కూడా వాడుకుంటుంటారు.
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బయట బ్యాంకులతో పోలిస్తే.. పార్లమెంటు ఆవరణలో ఉన్న బ్రాంచ్ లో తమ పనులు పూర్తి చేసుకోవటం సులువుగా ఉంటుందని పార్లమెంటు సిబ్బంది భావించారు. కానీ.. వారి కారణంగా ఎంపీలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారట. తమ ప్రైవసీకి ఇబ్బంది కలుగుతుందని.. సదరు బ్రాంచ్ కేవలం ఎంపీల కోసమే కాబట్టి.. పార్లమెంటు సిబ్బందిని బ్యాంకులోకి అనుమతించకూడదని వారు కోరుతున్నారట. ఎంపీలకు అసౌకర్యాన్ని కలిగించే ధైర్యం చేయలేని ఎస్ బీఐ.. తాజాగా ఎంపీలకు మాత్రమే తాము పెద్దనోట్లను మార్చుకోవటానికి.. డిపాజిట్లు వేసుకోవటానికి అవకాశం కల్పిస్తున్నట్లుగా ఒక నోటీసును బ్యాంకు గుమ్మం ముందు వేలాడదీశారు. ఓపక్క పార్లమెంటులో విధులు నిర్వహించి.. బయటకు వెళ్లి బ్యాంకుల వద్ద క్యూలో నిలుచోవటం పనికి ఇబ్బందిగా మారటంతో పాటు.. తీవ్ర అసౌకర్యానికి గురి అవుతామని.. ఎంపీలు తమ బాధల్ని పట్టించుకోవటం లేదని పార్లమెంటు సిబ్బంది వాపోతున్నారు.