టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వరుస పోస్టులతో సంచలనం సృష్టిస్తున్నారు. వాట్సాప్ స్టేటస్ ద్వారా పార్టీ నేతలపై నేరుగా విమర్శలు గుప్పిస్తూ, ఎంపీ చిన్ని వర్గీయులపై కూడా షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. విస్సన్నపేట మండలంలో కొంతమంది టిడిపి నాయకులు చేస్తున్న దోపిడీ, అవకతవకలపై నిలదీస్తూ ఆయన పోస్ట్‌లు పెద్ద చర్చకు దారితీశాయి.
కొలికపూడి ఒక పోస్టులో “నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్‌కా?” అంటూ మండిపడ్డారు. మరొక పోస్టులో, “పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే… నువ్వు నిజంగా రాయల్!” అని విమర్శిస్తూ, కొందరు నేతల వ్యవహారశైలిపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంకా, కొండపర్వ గట్టు దగ్గర రాత్రింబవళ్లు జరుగుతున్న “డే అండ్ నైట్” మ్యాచ్‌లు, అక్రమ కార్యకలాపాలపై లక్ష్యంగా ఆయన చేసిన పోస్టులు తిరువూరులో హాట్‌టాపిక్‌గా మారాయి. కొలికపూడి వరుస వ్యాఖ్యలు పార్టీ అంతర్గత పరిస్థితులను బయటపెడుతున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యే ఇలా బహిరంగ విమర్శలు చేయడంపై టిడిపి వర్గాల్లో కలకలం రేగగా, స్థానిక నాయకులు మాత్రం స్పందించకుండా నిశ్శబ్దం పాటిస్తున్నారు. కొలికపూడి పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ, ప్రజల్లో పెద్ద ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.




