మొత్తానికి రాజకీయ తెరపై చక్కటి నాటకాన్నే ప్రదర్శిస్తున్నట్టుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజధాని భూ సేకరణ అంశం గురించి వీరు వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే ఈ అనుమానాలు కలుగుతున్నాయి,
ఇలాంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకదాని తర్వాతగా మరోటి జరుగుతున్న పరిణామాలను బట్టి ఇదంతా పెద్ద డ్రామా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజధాని భూ సేకరణ అంశం గురించి అప్పుడెప్పుడో పవన్ జోక్యం చేసుకోవడం.. మళ్లీ ఇటీవల ఆ అంశం గురించి ఆయన రైతులను పరామర్శించడం.. అందుకు ప్రతిగా పవన్ కల్యాన్ కోరిక మేరకు భూ సేకరణను అపుతున్నామని ఏపీ మంత్రులు ప్రకటించడం… దానికి పవన్ కృతజ్ఞతలు చెప్పడం.. ఇదీ జరిగింది!
అయితే… ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఎపిసోడ్ లో కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరించారని స్పష్టం అవుతోంది. వ్యూహాత్మకంగా పవన్ ను రంగంలోకి దించినట్టుగా స్పష్టం అవుతోంది. రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న రైతుల్లో జగన్ హీరో కాకుండా.. పవన్ ను హీరోగా నిలబెట్టేందుకు. . మళ్లీ పవన్ చేత తామే ప్రశంసించబడుతూ క్రెడిట్ కొట్టేయడానికే తెలుగుదేశం వారు ఇలా చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఇప్పుడు భూ సేకరణ చేపట్టడం చట్టపరంగా కుదరదు. ఎందుకంటే.. తెలుగుదేశం ప్రభుత్వం ఉపయోగించుకొన్న భూ సేకరణ ఆర్డినెన్స్ కాలం చెల్లిపోయింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ఇప్పుడు చెల్లదు. అంటే భూ సమీకరణ లేదా సేకరణ చెల్లదు. దీంతోనే ఏపీ ప్రభుత్వం ఆ పనిని ఆపేసింది. అదేమంటే.. పవన్ కల్యాణ్ చెప్పడం వల్లనే భూ సమీకరణను ఆపామనిచెబుతున్నారు. ఆ విధంగా జనసేన అధినేతకు క్రెడిట్ ఇస్తున్నారు. దీన్నిబట్టి ఇదంతా ఒక వ్యూహాత్మకంగా జరిగిందని.. భూ సమీకరణ చట్టం చెల్లిపోవడంతో ఆ విషయాన్ని ప్రస్తావించకుండా.. పవన్ ను హీరోగా చేసేందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇదేం వంచనా?