నీ జీవితంలో ఇప్పటి వరకూ ఏ విషయంలోనూ ఓడిపోలేదని, తన జాతకంలోనే ఓటమి అనేది రాసి పెట్టి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని తాను దత్తత తీసుకున్న ఎర్రవెల్లి, నర్సన్నపేటలను అభివ్రద్ధి చేస్తానని ఆయన అన్నారు.
మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇతర కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా 42 కుటుంబాలకు చెందిన వారికి మూడు కోట్ల రూపాయల విలువ చేసే ట్రాక్టర్లను అందజేశారు. వీరు కాక మరో 16 మందిని ఉమ్మడిసాగు జోన్ ఆపరేటర్లుగా నియమించారు. మరో ఇద్దరిని ఎరువుల గోదాములకు పర్యవేక్షకులుగా కెసిఆర్ నియమించారు. ఇప్పుడు నిర్మిస్తున్న ఇళ్లను ఆగస్టు 4 వ తేది లోగా పూర్తి చేయాలని, ఆ తర్వాత పండుగ వాతావరణంలో ఇంటి గ్రహాప్రవేశాలు జరుపుకోవాలని ఆయన అన్నారు.
వచ్చే రెండేళ్లలో పాములపర్తి జలాశయం ద్వారా గోదావరి జలాలను అందిస్తామని, తాను దత్తత తీసుకున్న రెండు గ్రామాలకు 24 గంటల పాటు తాగు అందేలా చర్యలు తీసుకుంటామని సిఎం కెసిఆర్ చెప్పారు. స్వయం పాలన, స్వయం సంవ్రద్ధి, స్వయం గ్రామాల రూపకల్పనే తన లక్ష్యమని ఆయన అన్నారు.