Friday, May 9, 2025
- Advertisement -

మీరు తెలంగాణ ప్రజలను కించపరుస్తున్నారు – మంత్రులు

- Advertisement -

తెలంగాణ రాజకీయ జెఎసి నాయకుడు కోదండరామ్ కెసిఆర్, ఆయన ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కోదండరామ్ పై తెలంగాణ మంత్రులంతా విడివిడిగా మండిపడ్డారు. ఆయన ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఎనిమిది కోట్ల తెలంగాణ ప్రజలను కించపరిచినట్లేనని వారు అన్నారు. రాజకీయ జెఎసి నాయకుడు కోదండరామ్ విపక్షాల చేతిలో కీలుబొమ్మలా మారారని, వారు ఏం చెప్తే అది ఆయన చెబుతున్నారని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

ఇక ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ కోదండరామ్ ను దుష్టశక్తులు ఆడిస్తున్నాయని, ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనవి కావని, అవి ఆ దుష్టశక్తుల పనేనని అన్నారు. ప్రొఫెసర్ గా పని చేసిన కోదండరామ్ కు పాఠాలు చెప్పడానికి పాలన చేయడానికి తేడా తెలియదని, ముందుగా ఈ రెంటికి ఉన్న తేడాను ఆయన తెలుసుకోవాలని మరో మంత్రి లక్ష్మారెడ్డి హితవు పలికారు. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, పోచారం శ్రీనివాస రెడ్డి, జగదీష్ రెడ్డి కూడా ప్రొఫెసర్ కోదండరామ్ పై విరుచుకుపడ్డారు.

మీ వివరణ బట్టే మా తదుపరి చర్యలుంటాయని అని కోదండరామ్ ని పరోక్షంగా మంత్రులు హెచ్చరించారు. కోదండరామ్ కుబుసం విడిచిన నాగుపాములా వ్యవహరిస్తున్నారని, ఆయన కాంగ్రెస్ ఏజెంటులా వ్యవహరిస్తున్నారంటూ ఎంపి బాల్క సుమన్ మండి పడ్డారు. అయితే మరోవైపు కోదండరామ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోలేదు సరికదా ప్రభుత్వాన్ని ఇంకాస్త ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వం వచ్చిన రెండేళ‌్లలో ప్రజలకు చేసిందేమి లేదని అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, రెండేళ‌్లుగా వేచి చూస్తున్న తాము ఇక నిరీక్షించేది లేదని, ప్రభుత్వంపై ఉద్యమించి తీరుతామని అన్నారు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -