తెలంగాణ రాష్ట్రంలో కోర్టులు బంద్ పెట్టాలని తెలంగాణ న్యాయవాదులు నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లోనూ అన్ని సేవలు బంద్ చేయాలని తీర్మానించారు. సోమవారం నుంచి ఈ నెల 13 వ తేది వరకూ హైకోర్టు బార్ అసోసియేషన్ జిల్లాల్లోని అన్ని బార్ అసోసియేషన్లకు పిలుపునిచ్చింది.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు చేపట్టిన న్యాయాధికారుల ప్రొవిజనల్ కేటాయింపు సక్రమంగా జరగలేదని, అసలు ఇందులో పారదర్శకతే లోపించిందంటూ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. స్ధానికత ఆధారంగా ఇరు రాష్ట్రాల్లోనూ న్యాయాధికారుల నియమాకాలు జరగాలని, కాని అలా జరగకపోవడవంతో కోర్టులు బంద్ చేయాలని నిర్ణయించినట్లు న్యాయవాదుల సంఘం నాయకులు చెబుతున్నారు.
ఈ అంశంపై తెలంగాణ బార్ అసోసియేషన్, న్యాయమూర్తుల సంఘం, తెలంగాణా న్యాయాధికారుల సంఘం సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. తాత్కాలిక చీఫ్ జస్టీస్ చేసిన ఈ నియామకాలను వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 13న చలో హైకోర్టు కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు.