తెలంగాణాలో త్వరలో బీసీల కోసం ఓ కమిషన్ ను నియమిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామయ్య ప్రకటించారు. దీనిపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారని ఆయన అన్నారు. బీసీలకు సబ్ ప్లాన్ పై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని, దీనికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి వద్ద ఉందని ఆయన చెప్పారు.
అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగానే నగరంలో పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. పూలే జయంతి సభలో పాల్గొన్న మంత్రి రామయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తున్నట్లుగానే బీసీలకు కూడా కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తామన్నారు.
ఇందుకోసం 300 కోట్ల రూపాయలు కేటాయించామని, సంచార జాతుల కోసం ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలతో ఓ ఫెడరేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ ప్రతి చిన్న విషయానికి అగ్ర కులాల వారిని తిట్టడం సరికాదని, అక్కడ కూడా నిరుపేదలున్నారని అన్నారు.