భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడికి భద్రత పెంచింది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పటివరకు రామ్మోహన్‌కు వై-కేటగిరీ సెక్యూరిటీ ఉండగా దానిని వై-ప్లస్ కేటగిరీకి పెంచారు. దీంతో మొత్తం 11 మంది రామ్మోహన్ నాయుడుకు భద్రత కల్పించనున్నారు. వీరిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు గన్మెన్లతో పాటు మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ అధికారులతో కలిపి మొత్తంగా మంత్రికి నలుగురు సిబ్బంది భద్రతగా ఉండనున్నారు.
ఆపరేషన్ సిందూర్ తరువాత వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, ప్రజలు, సంస్థల రక్షణ, వీఐపీల భద్రతపై ఏపీలో ఉన్నతాధికారులు హైలెవల్ రివ్యూ చేశారు. సెక్యురిటీ ప్రొటోకాల్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. జన సమూహంలోకి సీఎం చంద్రబాబు వెళుతున్న సమయంలో పాటించాల్సిన నిబంధనలు, ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ ఆదేశించారు.