టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయాలతో వైసీపీ.. ఓ కుదుకునకు గురవుతోంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నడూ లేనంత సంక్షోభం వైసీపీలో కనిపిస్తోంది. ఎప్పుడు ఎవరు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతారో అర్థం కాక.. అధినేత జగన్ కూడా ఎలా పరిస్థితిని చక్కదిద్దాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే.. ఇప్పటికిప్పుడు సంక్షోభం నుంచి పార్టీని ఎలా గట్టెక్కించాలని జగన్ ఆలోచిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలు వచ్చే వరకూ.. ఎమ్మెల్యేలను దారిలో పెట్టుకుంటే.. సమస్య నుంచి బయటపడొచ్చన్నదే.. జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఒక్కొక్కరుగా వైసీపీ ఎమ్మెల్యేలను లాగేస్తున్న టీడీపీ.. రాజ్యసభ ఎన్నికల నాటికి ఆ పార్టీ బలాన్ని 40 కంటే తక్కువ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే జరిగితే.. తమకు అందుబాటులో ఉన్న ఆ ఒక్క రాజ్యసభ ఎంపీ సీటు కూడా పోతుందేమో అన్న ఆందోళన వైసీపీలో మొదలైందని తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు.. ఎమ్మెల్యేలను ఎలాగైనా కాపాడుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారట. తన కోటరీతో పాటు.. పార్టీలో నమ్మకస్తులైన కొందరితో నిత్యం ఇదే విషయంపై టచ్ లో ఉంటున్నారట. ఈ ప్రయత్నాలు ఎంత వరకు రిజల్ట్ ఇస్తాయో!