రుణమాఫీపై శాసన సభలో వాడి వేడి చర్చ జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీ లో కేంద్ర సహకారం లేకుండా రుణమాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ సమాధానం పై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ శాసన సభ సమావేశాల్లో ప్రశ్నత్తరాల సమయంలో రుణమాఫీపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా.. ఎన్నికల్లో ఇచ్చిన మాటకి కట్టుబడి రైతులకు 24 వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో లో రుణమాఫీ గురించి చెప్పకుండా పారిపోయిన పార్టీ వైసీపీ అని, వై యస్ హయాంలో రుణమాఫీ వద్దని కేంద్రానికి లేఖ రాశారని ప్రత్తిపాటి గుర్తుచేశారు.
మంత్రి వాదనను విపక్షనేత జగన్ ఖండించారు. చంద్రబాబు ఇచ్చిన ఏడు వేల కోట్లు కనీసం రుణాల వడ్డీలకు కూడా సరిపోలేదని విమర్శించారు. చంద్రబాబు సొంత బావకే రుణమాఫీ కాలేదన్నారు జగన్. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా ప్రజలను మోసం చేసినందుకు నిరసనగా సభనుండి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి సభ నుండి బయటకి వెళ్ళిపోయారు. వైసీపీ వాకౌట్ అనంతరం.. ప్రశ్నోత్తరాలను యథావిధిగా కొనసాగించారు.