ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలన్నీ కూడా కొన్నేళ్ళ క్రితం జగన్ చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. ఎన్నికల ఏడాదిలో రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో, చంద్రబాబు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో కొన్నేళ్ళ క్రితమే చెప్పాడు జగన్. వైకాపా నుంచి అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ సంబరపడిపోతున్న చంద్రబాబును నాడే హెచ్చరించాడు జగన్. ఎన్నికల ఏడాది వచ్చేసరికి అందరూ కూడా వైకాపా వైపు చూస్తారని, ఇఫ్పుడు అక్రమ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ఎన్నికల ఏడాదిలో తీవ్రంగా ఇబ్బందిపడతారని చెప్పాడు జగన్. టిడిపి నేతలు టిడిపినే ఓడించే పరిస్థితి ఉంటుందన్నాడు. జగన్ చెప్పినట్టుగానే ఆళ్ళగడ్డతో సహా చంద్రగిరి, బద్వేలు….ఇలా చాలా నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులను టిడిపి నేతలే ఓడించే పరిస్థితి కనిపిస్తోంది.
అలాగే వైకాపాలోకి చేరికలు కూడా భారీగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైకాపాలో చేరడం ఖాయం అని తేల్చి చెప్పేశాడు ఆనం. సోదరుడు చనిపోయినప్పటి నుంచీ ఆవేదనతో రగిలిపోతున్నాడు ఆనం. భూమా నాగిరెడ్డిని పదవి విషయంలో ఆత్మన్యూనతకు, ఆవేదనకు గురిచేసినట్టుగానే తమను కూడా చంద్రబాబు చేశాడని ఆనం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన సోదరుడు కూడా ఆ ఆవేదనతో చనిపోయాడని బాధగా చెప్తున్నాడు. అందుకే ఇంట్లో కూడా టిడిపి జెండాను, చంద్రబాబు బొమ్మను పీకేశారు. వైకాపాలో చేరడం కోసం బొత్స సత్యనారాయణతో మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచీ ఆనం సోదరులకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు బొత్స. టికెట్ ఆశించకుండా, ఎలాంటి షరతులు లేకుండా ఆనం కుటుంబం మొత్తం వైకాపాలో చేరుతుందని బొత్సతో చెప్పాడు ఆనం. ఇక జగన్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి. ఆ వెంటనే ఆనం కుటుంబం మొత్తం వైకాపాలో చేరడం ఖాయమే. ఎన్నికల ఏడాదిలో అధికార పార్టీని సీనియర్ నాయకులు వీడిపోతూ ఉండడం కచ్చితంగా 2019 ఎన్నికల్లో టిడిపి విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.